అక్షరాల అల్లికలు అలరారే అక్షరన్యాసాలు

#దీపం #కార్తీకమాసం
దివ్వెల వెల్లువలు నిండెను
వేయి వెలుగులు తెచ్చెను

శివుని పూజలతో జగమంత
కార్తీక మాసపు ఛవి అల్లెనట

తిమిరాలను వెడలగొడదాం
త్రినేత్రుడిని సదా ధ్యానిద్దాం

సూర్యుడి కిరణాలు మందగించె
ప్రణతుల కాంతులు వికసించె

హేమంతపు హిమలో హిమశైలము
ప్రణవ నాదాలు నెక్కొన్న ప్రదీప్తము

అనంత విభల వైశిష్ట్యం నిగుడు గాక
అమరనాథుడి దీవెనలు కలుగు గాక

#ఉమ్మడికుటుంబం
ఇల్లంత పిల్లల స్వరాలు
నిండియుండు ప్రాకారాలు
కిలకిలమను ఆటపాటలు
సందడులే సందడులు

అన్నదమ్ముల అన్యోన్యాలు
తోడికోడళ్ళ సరాగాలు
అత్తమామల అనురాగాలు
ఆత్మబంధాల పెన్నిధులు

పండుగల్లో సంబరాలు
కలిసి వండే పిండివంటలు
మనస్పూర్తిగ చేయు పూజలు
ఇంటిల్లిపాదికి రక్షాకవచాలు

కాలంతో కలుగుతున్న మార్పులు
అందరివి వేరు వేరు నివాసాలు
దానికి ఉన్నాయి అనేక కారణాలు
నేడు తగ్గాయి ఉమ్మడి కుటుంబాలు

#మతిస్థిమితం
ఏ జన్మలోని పాప ఫలమో
ఈ జన్మలో అనుభవించెనో

తన ప్రపంచపు ఒత్తిడిలో
తన మతినే బలి ఇచ్చెనో

ఒక కాలంలో మంచిగ బ్రతికెనో
నేడు పరిస్థితి మించి పోయెనో

ఓ మనుజా! బలహీనతను కించ పరచకు
స్థిమితంలేని మతిని దురుపయోగించకు

మతిభ్రమించినవాడూ మనిషేనోయ్
నవ్వి నువ్వు మానవత్వం వీడకోయ్!

#ప్రకృతిఅంతరాయం
ప్రకృతిలో అంతరాయాలు
కలిగించును వికృతములు
ముంచుకొచ్చును ప్రమాదాలు
తబ్బిబ్బవుతారు జనాలు

అతివృష్టుల అవకతవకలు
అనావృష్టుల అనరులు
అవని విదీర్ణాలు
ఎదురు చూడని విపరీతాలు

పెరిగిపోతున్న నాగరికతలు
తరుగుతున్న సద్గుణాలు
అలక్ష్యానికి లోనైన ప్రకృతులు
ఎదురు తిరిగెను నిసర్గము

మనుజులార తీసుకోండి జాగ్రత్తలు
చేయకండి చిందరవందరలు
రక్షించండి పరిసరాలు
అరికట్టండి ప్రకృతి వైపరీత్యాలు

#రాగం
రాగ సుధారసమును అందించితివి
గమకాల లహరులలో నే నడచితిని
భావము భవ్యముగా కదిలినది
మనసును ఆహ్లాద పరచినది

మౌనం
మౌనమేలనే మనసా
మాటకందని ప్రేమలో మునిగావా
ముచ్చటైన ఘడియలోన
చిరునవ్వును నీవు తొడిగావా

వెచ్చని ఎదలోంచి తొంగి చూస్తూ
వలపు పాశమును తాకితే
సంబరాల వేడుకలేవో
అంబరాలు తాకేనా

జ్ఞాపకాలు
కొన్ని జ్ఞాపకాల వెల్లువ తరగదు ఏనాటికి
మదిలో కొలువై మురిపించును ముమ్మాటికి

మలాము తానై హాయినిచ్చును మది బడలికి
ఊహల పల్లకిలో వెళ్లును చిన్ననాటి కాలానికి

కలము తానై అచ్చరముగ మారును కవికి
వరము తానై ప్రేమను పంచును ప్రియునికి