లక్షణాలు-

రెక్కలు ఆరుపాదాల ప్రక్రియ.
దీనికి ఎలాంటి నియమం లేదు
కాని మొదటి నాలుగు పాదాల తర్వాత ఒక ఎడం,
దాని తర్వాత రెండు పాదాలువస్తాయి.
అంటే పంక్తులను రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది.
పై నాలుగు పంక్తులకు చివర రెండు పంక్తులు రెక్కలు

1.

సానపట్టకనే
కత్తి కన్న పదును
నెత్తురు చూడకనే
చేయగలదు మాయని గాయం
బరువు తూచక మాటాడిన
మచ్చగ మిగులు చివరిదాక

2.

మనసు పడేదంత
సొంతం కాదు
సొంతమైనదంత
మనసుకు నచ్చదు
స్థితి తెలిసి ఆశించు
దగ్గర ఉన్నదాన్ని గౌరవించు

3.

ఆగక కదులుతు
సాగును ముందుకు
నిరంతర పయనం
చేతికందని నైజం
వినియోగించు ప్రతి క్షణం
కరగితే దొరకదు కాలం

4.

అలలకు తెలియదు
సముద్రపు లోతు
కలలకు తెలియదు
సాధనల పాట్లు
పక్కనోడు ఎరుగడు
మన పరిస్థితుల పల్లము

5.

భావాలు అనేకం
లోలోన
భావనల పోరాటం
ఎల్లవేళల
మాట మౌనముగా ఉన్నప్పుడు
గుండె బరువుకెక్కడ గొడుగు

6.

మెప్పు కొరకు
చేయు సాధన
మెప్పుజెప్పుకు
వాడు సాధన
మెరుపులాంటి నిపుణతకు
మెరపించుట అవసరమా!

7.

వేదాలు మనవి
వేదాంతాలు గొప్పవి
భారతము మనది
భారతి ఘనమైనది
దగ్గర ఉన్నదానికి విలువనిచ్చి చూడు
దొవ్వునున్న మడను చూసి మురిసిపోకు

8.

ఎండమావుల్లో
నీళ్ళు పట్టగలమా
ఎండలుముదురుడున్నా
నీడను పట్టగలమా
అందినందునే అంబరము కలదు
స్తోమతకు మించిన ఆశలు వలదు

9.

తప్పుడు చేష్టలతో
చేయకు రాద్ధాంతం
తాత్కాలిక ఇష్టాలకై
కూల్చకోకు జీవితం
లేని ప్రేమలపై మోజు పడి
శాశ్వత ప్రేమకు దూరం కాకు

10.

గుప్పెడు మనసులో
ప్రేమ అనంతం
గుట్టుగ దాచినగాని
నిలచేనా భావం
కలల ఊసులన్ని ఎదలో కలిసె
సడి చేయకుండ సందడి చేసె

11.

తొలి మెట్టు పెట్టి
భయము పోగొట్టు
మెల్లమెల్లగా ఎక్కు
ఒక్కో మెట్టు
సంకల్పానికి ఎక్కువ బలం
దృఢనిర్ణయాలకు ఓటమి దూరం

12.

సోదరానుబంధాలు
బాల్యపు సుగంధం
వయసు ఎదిగే కొద్ది
ఉండునా ఆ గంధం
జీవన తరంగాలలో మలపులు విపరీతం
ప్రతి మలపుతో పెరుగుతుందేమో దూరం

13.

ఒకే చెట్టు కొమ్మైనా
ఒకేలాగ కాయదు ఫలం
ఒక్క చోటున్నంత మాత్రాన
ఒకేలాగ ఉండదు జీవితం
పొత్తుగనున్నను పథాలు పొరుగు
పరిస్థితుల పల్లము పరులెరుగరు