top of page

కృష్ణదేవరాయలువిజయనగర సామ్రాజ్యం, చరిత్ర పుటాలలో పసిడి విభవము ప్రకాశించిన పర్వ శకం..

కృష్ణదేవరాయుల ఆస్థాన భవ్యాలను చదివిన ప్రతి హృదయంలో ఆ రాజవైభోగము చూచినంత అనుభవము, అనుభూతి పొంది, ఆ కాలం యొక్క వర్ణనాతీతపు సంపన్నముల ఊహలలో విహరించి ముఖారవిందములు వికసిస్తాయి.


రారాజు కృష్ణదేవరాయులు, మహా పండితులు. కవిత్వం, సంగీతం మరియు శిల్పకళ నైపుణ్యముల పట్ల ఆసక్తి గల ప్రాంగణము ఆ రాజ్యం. కవిసార్వభౌముడు ఏలిన కాలం తెలుగు సాహిత్యమునకు బంగారు యుగము. మహా మహా పండితులకు నెలవునిచ్చి అటు భాషలను మరియు కవి సామర్థ్యాలను వారి కుటుంబాలకు జీవనోపాధి ఒసగి ఠీవిగా నిలిచింది విజయనగర సామ్రాజ్యం.


ఆస్థానంలో అష్టదిగ్గజ కవులకు, సంగీత విద్వాంసులకు కొదువ లేదని నిరూపిస్తూ సవాలు చేస్తూ వచ్చిన ప్రతి పండితులకు తమ దిగ్గజాల పాండిత్యము జవాబు చెప్పగా మిన్నయగు అభిజాత్యములలో ఆరితేరిన ఆస్థానమని పేరు ప్రఖ్యాతలు ద్వీపకల్పము అంతయూ మారుమ్రోగింది. ఆస్థాన కవుల వైవిధ్యము అద్వితీయము.

దేశంలో ఎచ్చట ఏ కొరత లేక దేశవాసులు సుభిక్షతో జీవనం సాగించిన కాలం ఆ మహానుభావుడు ఏలిన సామ్రాజ్యం. ఎన్నో దేవస్థానాలు దక్షిణ భారతం మొత్తంలో శిల్ప కళా వైభవముతో నిండి కనులవైభవముగా ఆనాడు కట్టిన గుడి గోపురాలు ఈనాటికీ నిండు హృషితో పూజలు కొనసాగుతున్నాయి.. తిరుమల శ్రీనివాసుడి కోవెల ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతిగా నిలిచింది. విజయంతో జయభేరి మ్రోగించిన విజయనగర సామ్రాజ్యం అంటే రత్నాలు వజ్రాలు, వైడూర్యాలు సంతలో సేర్లతో కొలచి అమ్ముచుండెడి కాలం..

అట్టి వీరాధివీరునికి, వైశారద్యము గల మహా మనీషికి సహితం చిన్న చిన్న లోపాలు శతృవులకు అతి సులభముగ క్రుంగ చేయు ఆయుధముగా మారింది. ముసల్మానులు,సుల్తానులు మహమ్మదీయులు సరైన అవకాశం కొరకు వేచియున్న సమయములో కృష్ణదేవరాయల లోపం కత్తిమీద సానులా పట్టి రాధాసాని రూపంలో విజయనగరంలో పంజా విసిరారు.. మహామంత్రి తిమ్మరుసు తల్లితండ్రుల కన్నా ఎక్కువ ప్రేమ మర్యాదలు ఆప్యాయతలను పంచిన వారు. రాయలవారు ఈ ఎదుగుదలకు కారకులైనవారు. మహామంత్రి తిమ్మరసును రాధాసాని మరియు ఇతర దగాకోరుల వలన షడ్యంత్రములకు బలై రారాజు ఆతని కళ్ళు తీసి గద్దకు వేయమని ఆజ్ఞాపించారు.


మధు నశలో తమకుతాము కోల్పోయారు. మహమ్మదీయులు సుల్తానుల పన్నాగంలో మొగ్గలా విసిరిన రాధాసాని చర్యలు ఎంత కాదన్నా రాజులవారిని చివరలో దుర్గతికి చేర్చినది. మరో యుద్ధానికి సిద్ధమవుతుండగా అనారోగ్యముతో అలమటించి పరమపదించారు.


ఆనాటి వైభవము ఈనాటి కొంత శిథిలమైన హంపి శిల్పకళలు చూస్తే అంచనా వేయగలము. కథ చదివినవార్లకు ఆ రాజవైభవము, రమించిన అనుభోగము విజయనగర సామ్రాజ్యపు వైభవాలు మన అందరి ఊహానందాలకే సొంతం.


60 views0 comments

Comments


Post: Blog2_Post
bottom of page